శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ విన్యాసంపై జాంటీరోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్‌పై జాంటీ రోడ్స్ ప్రశంసలు
  • ఫీల్డింగ్‌కు తండ్రిని కాదు, ముసలి తాతను అయ్యానని రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్య
  • ఆధునిక ఫీల్డింగ్ ప్రమాణాలు అద్భుతమని దక్షిణాఫ్రికా దిగ్గజం కితాబు
  • హార్దిక్ పాండ్యా ఔట్‌కు కారణమైన అయ్యర్ బౌండరీ క్యాచ్‌పై స్పందన
  • కోచ్ రికీ పాంటింగ్ కూడా గొప్ప ఫీల్డర్ కావడం వల్లే ఇది సాధ్యమైందని వ్యాఖ్య
ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పట్టిన ఓ అద్భుతమైన క్యాచ్‌పై దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రేయస్ ఫీల్డింగ్ విన్యాసం చూశాక, తాను ఫీల్డింగ్‌కు తండ్రిని కాదని, తాతను అయిపోయాననిపిస్తోందని వ్యాఖ్యానించాడు. హార్దిక్‌ పాండ్యాను ఔట్‌ చేసే క్రమంలో అయ్యర్‌ అద్భుతమైన బౌండరీ సేవ్-కమ్-క్యాచ్‌ను అందుకోగా, ఆ ఫీట్‌కు సచిన్ టెండూల్కర్‌తో పాటు ముంబై డగౌట్‌లోని రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సైతం అవాక్కయ్యారు.

ఈ ఘటనపై దక్షిణాఫ్రికా గ్రేట్ జాంటీ రోడ్స్ ఎక్స్ వేదికగా స్పందించాడు. "నా రిటైర్మెంట్ తర్వాత ఫీల్డింగ్ ఎంతగా అభివృద్ధి చెందిందో అయ్యర్ 'టీమ్ క్యాచ్' చూశాక అర్థమైంది. చాలాకాలం నన్ను నేను ఫీల్డింగ్ కు అబ్బ లాంటి వాడ్ని అనుకున్నా. కానీ, ఆధునిక అథ్లెట్ల టైమింగ్, బౌండరీ లైన్‌పై వారి అవగాహన చూస్తుంటే ఇప్పుడు నేను ' ఫీల్డింగ్ లో ఓ ముసలి తాత'గా మారిపోయినట్లు అనిపిస్తోంది" అని రోడ్స్ పేర్కొన్నాడు.

తన కెరీర్‌లో 99 శాతం సమయం ఇన్నర్ సర్కిల్‌లోనే ఫీల్డింగ్ చేశానని, అప్పట్లో బౌండరీ ఫీల్డింగ్‌పై పెద్దగా దృష్టి ఉండేది కాదని రోడ్స్ గుర్తుచేసుకున్నాడు. "ముంబై ఇండియన్స్‌కు కోచ్‌గా పనిచేస్తున్నప్పుడు కీరన్ పొలార్డ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి వారు బౌండరీ వద్ద అద్భుతమైన ఫీట్స్ చేయడం చూశాకే, సిక్సర్లు ఆపడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాం" అని వివరించాడు.

ప్రస్తుత టీ20 క్రికెట్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారని, ఇలాంటి సమయంలో ఫీల్డర్ల నుంచి బౌలర్లకు మద్దతు ఎంతో అవసరమని రోడ్స్ అభిప్రాయపడ్డాడు. శ్రేయస్ క్యాచ్ అందుకు చక్కటి ఉదాహరణ అని, అతని జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కూడా గొప్ప ఫీల్డర్ కావడంతో ఇలాంటి ఫీట్లు ఆశించడంలో ఆశ్చర్యం లేదని ముగించాడు.

Shreyas Iyer
Jonty Rhodes
Punjab Kings
Mumbai Indians
Fielding
Cricket
Sachin Tendulkar
T20
Ricky Ponting
Kieron Pollard

More Telugu News